సీఎం జగన్‌ను కలిసిన 'సెంచరీ ప్లై బోర్డ్స్‌' ప్రతినిధులు

Centuryply Boards Company Representatives Meets CM YS Jagan. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా

By Medi Samrat  Published on  25 Aug 2021 1:42 PM GMT
సీఎం జగన్‌ను కలిసిన సెంచరీ ప్లై బోర్డ్స్‌ ప్రతినిధులు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్ ప్ర‌తినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ను క‌లిసిన వారిలో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ సజ్జన్‌ భజంకా, ఈడీ కేశవ్‌ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షా ఉన్నారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైబోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ నూతన ప్లాంట్‌ ఏర్పాటుచేయనుంది. ప్లైఉడ్, బ్లాక్‌ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డ్, పార్టికల్‌ బోర్డ్‌ల తయారీలో సెంచరీ ఇండియా కంపెనీ భారతదేశంలోనే అత్యంత పెద్ద తయారీ పరిశ్రమగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్ప‌టికే ఈ సంస్థ‌ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, అసోం, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో యూనిట్‌లు ఏర్పాటుచేసింది.

ఇక‌ ఏపీలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ప్రాజెక్ట్‌ నిర్మాణం చేప‌ట్ట‌నుంది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం వ‌ల్ల‌ 3,000 మందికి ప్రత్యక్షంగా, దాదాపు 6,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ల‌బించ‌నున్నాయి. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి.. డిసెంబర్‌ 2022 కల్లా మొదటి దశ ఆపరేషన్స్‌ మొదలుపెట్టేందుకు కంపెనీ సిద్దమవుతుంది. 2024 డిసెంబర్‌ కల్లా మూడు దశల్లో నిర్మాణం పూర్తిచేసుకోనుంది. ఏడాదికి 4,00,000 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో మొదటి విడత ప్రారంభించి.. మూడు దశలు పూర్తయ్యే సరికి 10,00,000 మెట్రిక్‌ టన్నుల పూర్తిస్ధాయి సామర్ధ్యం అందించే విధంగా రూపుదిద్దుకోనుంది.

కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రైతులలో యూకలిప్టస్‌ తోటల పెంపును ప్రోత్సహించి, కొనుగోళ్ళుపై గిట్టుబాటు ధర కల్పించడం, ఆర్ధికంగా రైతులకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని అన్నారు. కంపెనీ ప్రణాళికలను ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించి చర్చించారు ప్రతినిధులు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌ కరికాల్‌ వలవన్ పాల్గొన్నారు.


Next Story
Share it