మొంథా తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం

మొంథా తుపాను నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది.

By -  Knakam Karthik
Published on : 11 Nov 2025 4:50 PM IST

Andrapradesh, Cm Chandrababu, Cyclone Montha damage, Central team

మొంథా తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం

అమరావతి: మొంథా తుపాను నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలో సెంట్రల్ టీం సీఎంను కలిశారు. రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేసింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించింది. అయితే రూ.5,267 కోట్ల మేర తుపాను నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఓ మధ్యంతర నివేదిక ఇచ్చింది. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మొంథా తుపాను కారణంగా ప్రభావితం అయ్యాయని పేర్కొంది. దాదాపు 10 లక్షల మంది తుపాను, భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని నివేదికలో వెల్లడించింది. 9960 ఇళ్లు నీట మునిగాయని 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం పేర్కొంది. తుపానుతో పాటు భారీ వర్షం కారణంగా 4566 ఇళ్లు దెబ్బతిన్నాయని స్పష్టం చేసింది. 1.61 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని.. 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించింది.

4794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, 12,856 విద్యుత్ స్తంభాలు నేల కూలినట్టు స్పష్టం చేసింది. అలాగే 2,318 ట్రాన్సఫార్మర్లు పాడయ్యాయని నివేదికలో పేర్కొంది. మొంథా తుపాను కారణంగా పంటలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.6,384 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం పేర్కొంది. మొంథా తుపాను వల్ల నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని వెల్లడించింది. 3.36 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున తక్షణ ఆర్ధిక సాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Next Story