తెలుగు రాష్ట్రాలు సంయమనం పాటించాలి: కేంద్రం
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల శక్తిశాఖ
By Medi Samrat
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల శక్తిశాఖ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈనెల 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనున్నది.
కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6వ తేదీన వీడియో సమావేశంలో కేంద్ర జల శక్తిశాఖ అధికారులు నీటి సమస్యలపై చర్చించనున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలని కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తెలిపారు. నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈనెల 4వ తేదీ సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటి విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు.