సీఎం జగన్ కు ఊరట.. రఘురామకృష్ణరాజు ఏమన్నారంటే..!
CBI Court On Jagan Bail Petition. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.
By M.S.R
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. జగన్, విజయసాయి ఇద్దరి బెయిల్ పిటిషన్లను రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్లు వేయగా వీటిపై విచారణ జరిపిన కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. బెయిల్ రద్దు చేయాలంటూ థర్డ్ పార్టీకి పిటిషన్లు వేసే అర్హత లేదని విచారణ సందర్భంగా జగన్, విజయసాయి తరపు లాయర్లు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు పిటిషన్లను డిస్మిస్ చేసింది. రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు.
కోర్టు తీర్పు కొట్టివేతపై రఘురాజు స్పందిస్..తూ సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ కు వెళతానని ఆయన అన్నారు. వచ్చే వారంలో హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. సీబీఐ కోర్టు తీర్పు ఇలాగే వస్తుందని తాను ముందే ఊహించానని రఘురామకృష్ణరాజు అన్నారు. గత విచారణ సందర్భంగా జడ్జి తన అభిప్రాయాన్ని వెల్లడించకముందే జగన్, విజయసాయిల బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసిందంటూ సాక్షిలో బ్రేకింగ్ వచ్చిందని ఆ రోజు సాక్షి ప్రకటించిన విధంగానే ఈరోజు కోర్టు తీర్పు వచ్చిందని అన్నారు. తాను నెగ్గననే విషయం గత నెల 25వ తేదీనే తనకు అర్థమయిందని చెప్పారు. ఒకవేళ కోర్టులో తాను నెగ్గి ఉంటే జగన్, విజయసాయిరెడ్డి హైకోర్టుకు వెళ్లేవారని ఇప్పుడు తాను హైకోర్టుకు వెళ్తానని చెప్పారు. హైకోర్టులో కూడా వారికి అనుకూలంగానే తీర్పు వస్తే తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు.