వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ దక్కలేదు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు బెయిల్ కు నో చెప్పింది. వైఎస్ భాస్కర రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీబీఐ వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏప్రిల్ 16వ తేదీన అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డి అరెస్టుకు రెండు రోజుల ముందు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి నిందితుడేనని సీబీఐ ఇప్పటికే వెల్లడించింది. ఈ కేసులో ఏ-7గా ఉన్న భాస్కర్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో ఈ విషయం స్పష్టం చేసింది.