పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. క్రిస్టియన్ సంఘాలు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం చంద్రబాబు సమగ్ర విచారణ జరిపి, నిజనిజాలు తేల్చాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ ఎంపీ హర్ష కుమార్ పాస్టర్ ప్రవీణ్ మృతిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను ఎక్కడో చంపేసి, రోడ్డు పక్కన విసిరేయడం ద్వారా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలతో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే, హర్ష కుమార్ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పాస్టర్ మృతి కేసులో తప్పుడు ఆరోపణలు చేశారంటూ మాజీ ఎంపీపై బీఎన్ఎస్ సెక్షన్ 196, 197 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.