కారెక్కి కూర్చున్న జనసేనాని.. కేసు నమోదు

By Medi Samrat  Published on  12 Nov 2022 10:43 AM GMT
కారెక్కి కూర్చున్న జనసేనాని.. కేసు నమోదు

జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఇప్పటం వచ్చే క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కొద్దిదూరం కాలినడకన వచ్చిన పవన్, తర్వాత కారు టాప్ పై కూర్చుని, కాళ్లు చాపుకుని ప్రయాణించారు. పక్కనే మరికొందరు కూడా ఆయన్ను పట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శివకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ 336, రెడ్ విత్ 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. టాప్ పైన కూర్చుని ప్రయాణించడం ప్రమాదకరం అని ఫిర్యాదుదారుడు శివకుమార్ పేర్కొన్నారు. ఆ సమయంలో పవన్ కాన్వాయ్ ని అనేక వాహనాలు అనుసరించాయని, రాష్ డ్రైవింగ్ చోటు చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించే నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్లలో ర్యాలీగా మంగళగిరి నుంచి ఇప్పటం వెళ్లారు. అయితే ఆ సమయంలో పవన్ ఒక కారు టాప్ మీద కూర్చుని ప్రయాణించారు. ఫిర్యాదులో ఒక్కసారిగా జనసేన పార్టీ కార్యకర్తలు అనేక కార్లు, బైకులలో ర్యాలీగా ఇప్పటం రోడ్డు వైపుకు అజాగ్రత్తగా, అతి వేగంగా నడుపుతూ నిర్లక్ష్యంగా వెళ్లారని ఉంది. అన్ని వాహనాలు ఒక్కసారిగా వేగంగా ఇప్పటం వైపు వెళ్లేసరికి ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. అన్నిటికంటే ముందుగా టీఎస్ జీరో సెవెన్ జి జి 2345 అనే నెంబర్ గల తెల్ల కారులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళుతున్నారని ఆయన కారు పైన కూర్చుని ఉండగా అదే కారుకు కొంతమంది అటు కొంతమంది ఇటు వేలాడుతూ అలానే ఇప్పటం వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు డ్రైవర్ ఎవరో తెలియదని రాష్ డ్రైవింగ్ చేస్తున్నందుకు అతనిపైన కారు పైన కూర్చున్నందుకు పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story