AP: వాలంటీర్లపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు
ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మానవ అక్రమ రవాణాకు ఏపీలోని గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని పవన్ చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది.
By అంజి Published on 14 July 2023 4:07 AM GMTAP: వాలంటీర్లపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు
ఒంటరిగా నివసించే మహిళలను లక్ష్యంగా చేసుకుని మానవ అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది. వాలంటీర్లలో ఒకరి ఫిర్యాదు ఆధారంగా, విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ జనసేన చీఫ్‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 153 (అల్లర్లు సృష్టించే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టడం), 153A (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, 505(2) కింద కేసు నమోదు చేసింది. చివరి మైలు పాలనను నిర్వహించడానికి 2019లో వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించింది.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు యాక్సెస్ పాయింట్లుగా వ్యవహరించేందుకు వివిధ గ్రామాల నుంచి 2 లక్షల మందికి పైగా వాలంటీర్లను ఈ వ్యవస్థలో నియమించారు. జూలై 9, ఆదివారం నాడు ఏలూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో వాలంటీర్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వాలంటీర్లపై వ్యక్గిగతంగా పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామాల్లోని వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా, వితంతువులున్నారా లేదా అనే వివరాల్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడమే కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కేంద్ర నిఘా సంస్థల నుంచి తనకు సమాచారం ఉందన్నారు.
ఆరోపించిన అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి చెందిన సీనియర్ నాయకుల ప్రమేయం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలకు ఆయన ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ది హిందూ యొక్క నివేదిక ప్రకారం.. ఫిర్యాదు చేసిన వాలంటీర్ పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ప్రస్తావించారు. పవన్ తన ప్రసంగంలో తమను అవమానపర్చారని, మహిళలలో భయాందోళనలు సృష్టించారని అని అన్నారు. పవన్ వివాదాస్పద ప్రసంగం తరువాత, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తన వాదనలకు రుజువు ఇవ్వమని కోరుతూ పవన్ కళ్యాణ్‌కు నోటీసు పంపింది. “మీ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. కేవలం రాజకీయాల కోసమే మహిళల్లో భయాందోళనలు సృష్టించేలా నిరాధారమైన ప్రకటనలు చేస్తున్నారా? అని నోటీసులో కోరారు.