'జగనన్న భూహక్కు-భూరక్ష'పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Cabinet sub-committee meeting on 'Jagananna Bhuhakku-Bhuraksha'. సచివాలయంలోని మూడో బ్లాక్ లో బుధవారం జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన

By Medi Samrat  Published on  8 Feb 2023 6:24 PM IST
జగనన్న భూహక్కు-భూరక్షపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

సచివాలయంలోని మూడో బ్లాక్ లో బుధవారం జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యింది. సబ్ కమిటీ లోని సభ్యులుగా ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి జగన‌న్న భూరక్ష-భూహక్కు పథకం ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రమే ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు. బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రం అంతా కూడా ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వం సహించేది లేదని అన్నారు. సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను కూడా ప్రభుత్వం జారీ చేసిందని అన్నారు.

ఇప్పటి వరకు 4.3 లక్షల సబ్ డివిజన్ లలో సుమారు 2 లక్షల మ్యూటేషన్ లను పరిష్కరించామని తెలిపారు. ఈ ఏడాది మే నెల నాటికి 6వేల గ్రామాలు, ఆగస్టు నెల నాటికి 9వేల గ్రామాలు, అక్టోబర్ నాటికి 13వేల గ్రామాలు, డిసెంబర్ నాటికి మొత్తం 17,461 గ్రామాలకు భూహక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు 5264 గ్రామాల్లో డ్రోన్ ద్వారా చిత్రాలను రికార్డు చేయడం జరిగిందని, జూన్ 2023 నాటికి 4006 గ్రామాలకు ఓఆర్ఐ మ్యాప్ లను సిద్దం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే 3191 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్, 2464 గ్రామాలకు గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేశారని, మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కోరారు.

ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. అలాగే భూయజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా మొబైల్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో విచారించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా సమగ్ర సర్వేను ప్రారంభించాలని సూచించారు. ఇప్పటికే సర్వే కోసం 30 అత్యాధునిక డ్రోన్లు, 70 బేస్ స్టేషన్లు, 1330 జిఎన్ఎస్ఎస్ రోవర్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, మ్యాప్ లను సిద్దం చేయడం, వెరిఫికేషన్, నోటీసుల జారీ చేయడం, వివాదాలను పరిష్కరించడం, సర్వే రాళ్ళను నాటడం దశలవారీగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు.




Next Story