వివేకా తరహాలో ఆయన్ని కూడా చంపేశారేమో.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చిన విధంగా వాగుతున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు
By Medi Samrat Published on 24 Sep 2024 6:24 AM GMTపొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చిన విధంగా వాగుతున్నాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా ఇలాగే కూతలు కూశాడు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ కు పాలేరులా పని చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ఇప్పుడు తిరుమల లడ్డూని అపవిత్రం చేసినా పంది కొవ్వుతో పోల్చి మాట్లాడుతున్నాడు.. అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంది కొవ్వు గురించి జగన్, విజయసాయి రెడ్డి లకు చెప్పు.. గతంలో వారి ద్వారా ప్రజాధనం తిన్నావు.. అన్నంలో నువ్వు పంది కొవ్వు వేసుకుంటున్నావా, నెయ్యి వేసుకుంటున్నావా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లాయర్ అయితే ఏదైనా వాగుతావా.. నీకు లా పట్టా ఎవరిచ్చారని ప్రశ్నించారు. నిబంధనలు పాటించని నువ్వు లాయర్ గా అనర్హుడివి అని అన్నారు. పొన్నవోలు లా పట్టా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటాగా తీసుకుని పొన్నవోలు పై కేసు పెట్టాలన్నారు. న్యాయ వ్యవస్థకే కళంకం తెచ్చే పొన్నవోలును కోర్టులో అనుమతించకూడదన్నారు. నువ్వు ఇంకో ఒక్కసారి వాగితే .. నీకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దమ్ముంటే నాపై కేసు పెట్టుకో.. న్యాయదేవత సాక్షిగా నీ సంగతి తేలుతుందని సవాల్ విసిరారు.
భూమన కరుణాకర రెడ్డి నిన్న తిరుమలపై డ్రామా ఆడారని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి ఆస్తులను కొల్లగొట్టిన నువ్వా ప్రమాణం గురించి మాట్లాడేది.. రక్తం కక్కుకుని చస్తా అంటున్నావు.. దేవుడు వెంటనే శిక్షించడు.. కానీ నీకు ఆ దేవుడు తప్పకుండా బుద్ధి చెబుతాడని అన్నారు. నేను హిందువు అంటున్నావు.. క్రైస్తవ పద్దతిలో మీ ఇంట్లో పెళ్లి చేయలేదా అని ప్రశ్నించారు. నీకు నచ్చిన మతం తీసుకో..కానీ వెంకన్నకు అపచారం చేస్తే ఊరుకుంటామా అని ప్రశ్నించారు.
ఇంత జరుగుతుంటే ధర్మారెడ్డి ఏమయ్యాడు.. మాట్లాడడా అంటూ ప్రశ్నించారు. లడ్డు వ్యవహారంలో నోటి కొచ్చినట్లు వాగితే ప్రజలు చెప్పులతో కొడతారన్నారు. పొన్నవోలు.. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా నీలాగా మాట్లాడతాడా.. నీకు పాపం పండింది.. శిక్ష అనుభవించడానికి సిద్దంగా ఉండు అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేయడానికి జగన్ ప్రయత్నం చేశాడని ఆరోపించారు. అసలు పందికొవ్వు, నెయ్యి, బంగారం, ఇత్తడితో పోలికేంటి పొన్నవోలు అని ప్రశ్నించారు. మదమెక్కి, తిక్క ఎక్కి, జగన్ కోసం వాగుతున్నాడని మండిపడ్డారు. నువ్వు మోకాళ్ల మీద నిలబడి క్షమాపణ కోరాలన్నారు.
రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి చంద్రబాబు పై విమర్శలు చేశాడు. బార్ అసోసియేషన్ లు కూడా ఆలోచనలు చేయండి.. పొన్నవోలు ను సస్పెండ్ చేయండని కోరారు. హైకోర్టు కూడా స్పందించి పొన్నవోలును ప్రాసిక్యూట్ చేయాలన్నారు.
దేశంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిన చరిత్ర ఎపీలోనే జరిగిందన్నారు. పి.యస్.ఆర్ ఆంజనేయులు ను అరెస్టు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటిలిజెన్స్ అధికారిగా కాకుండా మాఫియా డాన్ గా పని చేశాడన్నారు. ప్రభుత్వ అధికారిగా ఉండి.. జగన్ కు అనుచరుడిగా వ్యవహరించాడని సంచలన ఆరోపణలు చేశారు. ఒక అమ్మాయికి అన్యాయం చేసిన ముగ్గురు ఐపిఎస్ అధికారులను అరెస్టు చేయాలన్నారు. చాలా మంది అధికారులు జగన్ కు తొత్తులుగా పని చేశారన్నారు.
ధర్మారెడ్డి కూడా ప్రతిపక్ష నేతలు తిరుమల వెళితే ప్రోటోకాల్ పాటించలేదన్నారు. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నా బయటకి రావాలని డిమాండ్ చేశారు. వివేకా తరహాలో ఆయన్ని కూడా చంపేశారనే అనుమానం మాకు ఉందన్నారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని డిమాండ్ చేశారు.