అమలాపురంలో బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు
BRS Flexi in Ambedkar Konaseema district of AP. అమలాపురంలో బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు
By అంజి
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించినప్పటి నుండి బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. పార్టీని ప్రకటించిన రెండు రోజుల్లోనే ఏపీలో చాలా మంది స్పందించి మద్దతు తెలిపారు. మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా రేవు అమ్మాజీరావును ప్రకటిస్తున్నట్లు ఫ్లెక్సీలు వెలిశాయి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఫ్లెక్సీలపై 'జై బోలో జై కేసీఆర్' అనే నినాదాలు ఉన్నాయి. అయితే బీఆర్‌ఎస్ అనే పేరుతో పార్టీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ విజయవాడలోని వారధి ప్రాంతంలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ ప్రకటనకు స్వాగతం పలుకుతూ ఇంద్రకీలాద్రిపై ఏపీ నేతలు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. కాగా ఇప్పుడు ఫ్లెక్సీల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది.