ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ : తోట చంద్రశేఖర్

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంద‌ని తోట చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2023 3:08 AM GMT
BRS,Thota Chandrasekhar

తోట చంద్రశేఖర్


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌)కి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంట్ స్థానాల నుంచి బీఆర్ఎస్ పోటీ చేస్తుంద‌ని తెలిపారు. ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంపిణీకి అడ్డుకట్ట వేస్తేనే ప్ర‌జ‌లు మెచ్చే పాల‌న వ‌స్తుంద‌న్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ శక్తిమంతంగా ఎదుగుతోందని, ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉనికి లేద‌ని, వైసీపీ, టీడీపీలు రెండు అవినీతిలో కూరుకుపోయాయ‌న్నారు. ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, బీఆర్ఎస్ వైపు చూస్తున్నార‌న్నారు.

రాజ‌ధాని గురించి ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారని మండిప‌డ్డారు. వైసీపీ, టీడీపీలు ఒక‌రిపై మ‌రొక‌రు నింద‌లు వేసుకోవ‌డంతోనే స‌రిపోతుంద‌న్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందడంలో వైఎస్సార్‌సీపీ విఫలమైందని, అందుకే చాలా తక్కువ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలను బీజేపీ మోసం చేసింది. రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, అయితే యూ టర్న్ తీసుకుంద‌న్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన లేదన్నారు. బీజేపీ మూల్యం చెల్లించుకునే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు.

Next Story