మార్చిలోపు అన్ని పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు
మార్చి నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ సేవల సదుపాయం కల్పిస్తామని భారత్ డిజిటల్ నిధి అధికారులకు ఏపీ పైబర్‌నెట్ ఎండీ కె. దినేష్ కుమార్ తెలిపారు.
By Medi Samrat Published on 17 Dec 2024 9:15 PM ISTమార్చి నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ సేవల సదుపాయం కల్పిస్తామని భారత్ డిజిటల్ నిధి అధికారులకు ఏపీ పైబర్‌నెట్ ఎండీ కె. దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్ భారత్ నిధి నిధులతో చేపడుతున్న భారత్‌నెట్-2 ప్రాజెక్టు పనుల ప్రగతి గురించి మంగళవారం విజయవాడలోని బీఎస్ ఎన్ ఎల్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పైబర్ నెట్ ఎండీ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారత్ నెట్ ప్రాజెక్టు పనుల ప్రగతి గురించి వివరించారు. 2025 మార్చి నెలాఖరులోపు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల సదుపాయం కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, ఈ మేరకు పనులు వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. భారత్ నెట్ పథకంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని 15వేల మందికి పైబర్ నెట్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ కల్పించామన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు మరరో 11,254 పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. భారత్‌నెట్-2 పథకం కింద అన్ని పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని తెలిపారు. డిజిటల్ పంచాయతీల దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు.
భారత్ నెట్ అమలు భేష్
ఆంధ్రప్రదేశ్‌లో భారత్ నెట్ ప్రాజెక్టు పనులు అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. డిజిటల్ భారత్ నిధి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ వర్ష్‌నే మాట్లాడుతూ ఏపీలో భారత్‌నెట్-2 ప్రాజెక్టు పనులు బాగా జరుగుతున్నాయన్నారు. నిర్దిష్ట లక్ష్యామేరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, దానికి అవసరమైన సహకారం తాము అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో డిజిటల్ భారత్ నిధి డైరెక్టర్ హరికృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.