ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈ పరీక్షకు ఓ నవ వధువు పెళ్లి దుస్తులతోనే కేంద్రానికి చేరుకుంది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతికి చెందిన మమత.. గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయింది. మెయిన్స్ రాయాల్సి ఉంది. నిన్న రాత్రి ఆమె వివాహం జరిగింది. ఉదయాన్నే పరీక్ష ఉండటంతో తలపై జీలకర్ర బెల్లం.. పెళ్లి దుస్తులతో అలాగే పరీక్ష కేంద్రానికి వెళ్లింది. దీంతో ఎగ్జామ్ సెంటర్‌కు పెళ్లి దుస్తులతోనే వచ్చిన ఆమెను అందరూ ఆసక్తిగా చూశారు.
కాగా వివాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్య గ్రూప్-2 మెయిన్స్ మొదలైంది. రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించాలని కోరుతూ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పరీక్షను వాయిదా వేయమని ఏపీపీఎస్సీని కోరింది. అయితే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అందుకే ఈ పరీక్షను షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది.