టీటీడీలో ఇక నుంచి కల్తీ నెయ్యికి బ్రేక్.. అందుబాటులోకి అధునాతన పరికరాలు

తిరుమల శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి ఏ మాత్రం ఆస్కారం లేకుండా టీటీడీ పకడ్బందీ విధానాలను ప్రవేశపెట్టబోతుంది. ప్రధానంగా లడ్డూ, అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీని వంద శాతం గుర్తింయచే అధునాతన పరికరాలు తిరుమలలోని టీటీడీ ల్యాబ్‌కు చేరుకున్నాయి.

By Knakam Karthik  Published on  21 Jan 2025 12:16 PM IST
telugu news, tirumala, ttd

టీటీడీలో ఇక నుంచి కల్తీ నెయ్యికి బ్రేక్.. అందుబాటులోకి అధునాతన పరికరాలు

తిరుమల శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి ఏ మాత్రం ఆస్కారం లేకుండా టీటీడీ పకడ్బందీ విధానాలను ప్రవేశపెట్టబోతుంది. ప్రధానంగా లడ్డూ, అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో కల్తీని వంద శాతం గుర్తించే అధునాతన పరికరాలు తిరుమలలోని టీటీడీ ల్యాబ్‌కు చేరుకున్నాయి. గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ( నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ) పంపిన రూ.70 లక్షల విలువైన రెండు లేటెస్ట్ ల్యాబ్ పరికరాలు తిరుమలకు వచ్చాయి. జర్మనీ నుంచి వచ్చిన ఈ రూ.70 లక్షల విలువైన 2 యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు టీటీడీకి విరాళమిచ్చింది. త్వరలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు చేతుల మీదుగా ఈ మెషీన్లను ప్రారంభించనున్నారు.

ఈ సరికొత్త పరికరాల సాయంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యితోపాటు నిత్యావసర సరకుల్లో కల్తీని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. తిరుమలలో కల్తీ నిర్ధారణకు సరైన ల్యాబ్‌ సౌకర్య అందుబాటులో లేకపోవడంతో.. తిరుమలలో వినియోగించే నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు ఎన్‌డీడీబీ అత్యాధునిక పరికరాలు అందించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీటీడీకి జీసీ (గ్యాస్‌ క్రోమటోగ్రఫీ), హెచ్‌పీఎల్‌సీ (హై పెర్ఫామెన్స్‌ లిక్విడ్‌ క్రోమటోగ్రఫీ) అనే రెండు పరికరాలను ఎన్‌డీడీబీ అందజేసింది. ఈ ల్యాబ్ పరికరాల సాయంతో.. నెయ్యితో పాటుగా నిత్యావసర సరకుల నాణ్యత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఆర్‌ నిబంధనల ప్రకారం ఉందో లేదో పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి నమూనాలను 2024 జూలై 8న ఎన్‌డీడీబీ సీఏఎల్‌ఎఫ్‌ ల్యాబ్‌కు పంపించారు. అదే నెల 17న ఈ మేరకు నివేదిక రావడంతో నెయ్యి కల్తీ వ్యవహారం కలకలంరేపింది. ఈ క్రమంలో తిరుమలలోని ల్యాబ్‌కు నెయ్యిని పరీక్షించే సామర్థ్యం లేదు.. అందుకే ల్యాబ్‌లో అత్యాధునిక పరికరాలు అవసరమని భావించారు. అందుకే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Next Story