పదేళ్లున్నా పారిపోయి వచ్చి ఇప్పుడు నీతులు మాట్లాడతారా?

Botsa Satyanarayana Fires On Chandrababu. ఉత్తరాంధ్రలో ముఖ్య పట్టణమైన, రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్

By Medi Samrat  Published on  28 Aug 2021 7:12 PM IST
పదేళ్లున్నా పారిపోయి వచ్చి ఇప్పుడు నీతులు మాట్లాడతారా?

ఉత్తరాంధ్రలో ముఖ్య పట్టణమైన, రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే.. రెండేళ్ళుగా ప్రతిపక్ష టీడీపీ ఎందుకు అడ్డుపడుతుందో చెప్పాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పకుండా ఏ మొహం పెట్టుకుని చర్చా వేదికలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. విజయనగరంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఏ ఒక్క కార్యాలయం కూడా కట్టడానికి వీల్లేదని.. రిట్ పిటిషన్లు వేసి.. ఏ ఒక్క కార్యాలయం విశాఖకు రాకుండా.. ఇక్కడ ఏ నిర్మాణం జరగకుండా.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నంబర్ 1 శత్రువులుగా నిలబడింది మీరు అవునా.. కాదా..? అని మంత్రి నిలదీశారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకు "పోరుబాట మీ మీద చేయాలి.. మీరు పోరుబాట చేసేదేంటి.." అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఎక్కడ ఉన్నారు? వాళ్లు ఎక్కడ ఉండాలో చెప్పమనండి. ఆయన ఇంటి డోర్‌ నంబర్‌ చెప్పమనండి. పక్క రాష్ట్రంలో ఉండి కుటుంబంతో ఎంజాయ్‌ చేస్తూ.. ఇక్కడకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తారా? ఉమ్మడి రాజధాని పదేళ్లు ఉన్నా పారిపోయి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడతారా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక - పోరాటం చేస్తాం.. అంటూ.. టీడీపీ చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనే దానిపై ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని సూచించారు.

అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సూటిగా అడుగుతున్నాం.. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి అనే నినాదంతో మూడు రాజధానులను మా విధానంగా తీసుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రత్యేక నగరం అయిన విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటిస్తే.. ప్రతిపక్షంలో ఉన్న వీళ్లు.. కోర్టుకు వెళ్లి వ్యాజ్యాలు వేశారు. విశాఖలో ఏ ఒక్క భవనం కట్టడానికి వీల్లేకుండా స్టేలు తీసుకు వచ్చారు ఇది వాస్తవం కాదా? మరి ఏ మొహం పెట్టుకుని ఇవాళ వచ్చి చర్చా వేదికలు, పోరాటం అని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా.? ప్రజలకు ఏమీ తెలియదు, అచ్చెన్నాయుడు, అశోక్‌ గజపతిరాజు వీళ్ళే మేధావులని అనుకుంటున్నారా? అని మండిప‌డ్డారు.


Next Story