ఢిల్లీలోని ఏపీ భవన్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. భవనాన్ని పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు ఒక ఈమెయిల్ వచ్చిందని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి ఏపీ భవన్ మొత్తం తనిఖీ చేయించారు. భవన్ పరిసరాలను డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసినా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక బెదిరింపు మెయిల్ పంపిన వారిని గుర్తించడానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఢిల్లీలోని సీనియర్ అధికారుల కోసం పూలే సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసిన సమయంలో బాంబు బెదిరింపులకు సంబంధించిన మెయిల్ రావడంతో ఏపీ భవన్ లో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ఆ తర్వాత బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.