బెయిల్ వచ్చిన వాళ్లంతా నిర్దోషులు కాదు : బొజ్జల సుధీర్ ఫైర్
శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోట ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
By - Medi Samrat |
శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోట ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా, మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోందని వాపోయారు. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే 19 రోజుల్లో బెయిలు ఇచ్చిందని, నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చిందన్నారు. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేనని, తాను ఏ తప్పు చేయలేదన్నారు. నిజ నిజాలు శివయ్యకు తెలుసన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టే.. మీడియా ముందుకు రాలేక పోతున్నానని తెలిపారు. ఇక కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తానన్నారు.
కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబును చంపేందుకు బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి కుట్ర చేసినట్లుగా చనిపోయిన డ్రైవర్ శ్రీనివాసులు సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. వినుత దంపతులను హత్య చేసేందుకు ఎమ్మెల్యే రూ.30 లక్షలు ఒప్పందం కుదుర్చుకుని, ముందస్తుగా రూ.20 లక్షలు ఇచ్చారని రాయుడు తన సెల్ఫీ వీడియోలో చెప్పాడు. తనపై వస్తున్న ఆరోపణలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి స్పందించారు. కోట వినుత డ్రైవర్ హత్య గురించి అందరితో పాటే తనకు తెలిసిందని అన్నారు. రాయుడికి సంబంధించిన వీడియోను తాను కూడా నిన్ననే చూశారని, ఆ వీడియోను బెదిరించాక తీయించారా లేక.. ఫేక్ వీడియోనా అనేది తెలియాలన్నారు. కోట వినుత ఏరోజు కూడా తమకు సహరించలేదని అన్నారు. ఇలాంటి చెత్త రాజకీయాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని, కోట వినుత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బెయిల్ వచ్చిన వాళ్లంతా నిర్దోషులు కాదని కామెంట్ చేశారు. రాయుడి వీడియోనే నిజమైతే ఎన్ని చిత్రహింసలు పెట్టి తీయించారో పోలీసులు తేల్చాలని ఎమ్మెల్యే బొజ్జల వెంటక సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు.