ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన రక్తం.. ప్రాణాలు కాపాడిన డాక్టర్లు..!
By Medi Samrat Published on 6 Nov 2024 8:45 PM ISTగత మూడు నెలలుగా తీవ్రంగా ఆయాసంతో బాధపడుతూ.. ఇటీవల కొంత కాలం నుంచి దగ్గుతుంటే నోట్లోంచి రక్తం పడుతున్న 62 ఏళ్ల వ్యక్తికి అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు సమయానికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సమస్యను, ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ మూడే సందీప్ తెలిపారు.
“ధర్మవరానికి చెందిన 62 ఏళ్ల రైతు గత మూడు నెలలుగా తీవ్రమైన ఆయాసంతో బాధపడుతున్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికి అది మరింత ఎక్కువగా ఉంది. దానికితోడు దగ్గుతుంటే నోట్లోంచి విపరీతంగా రక్తం పడుతోంది. ఈయనకు గతంలో గుండె రక్తనాళాల వ్యాధి (కరొనరీ ఆర్టెరీ డిసీజ్-సీఏడీ), క్షయ (టీబీ), హెపటైటిస్ బి లాంటి సమస్యలు ఉండేవి. ఈ సంవత్సరం జూన్ 18న ఇలాంటి సమస్యే రావడంతో ఆయనకు కుడివైపు ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించారు కూడా. తాజాగా ఇతడికి వచ్చిన సమస్య ఏంటో తెలుసుకోవడానికి ముందుగా సీటీ స్కాన్ చేశారు. అనంతరం లోపల రక్తం కారుతోందని తెలిసింది. అది ఎక్కడినుంచి వస్తోందో తెలుసుకునేందుకు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి ఆధ్వర్యంలో ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ పరీక్ష చేశారు. అప్పుడు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో ఒకటి పగిలినట్లు గుర్తించారు. అప్పుడు బ్రాంకియల్ ఆర్టెరీ ఎంబొలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా పగిలిన రక్తనాళాన్ని సరిచేశాం. ఇది చిన్నపాటి రంధ్రంతోనే చేయగల మినిమల్లీ ఇన్వేజివ్ ప్రక్రియ. ఇందులో పెద్ద కోత పెట్టాల్సిన అవసరం ఉండదు. దీనిద్వారా ఊపిరితిత్తుల్లో అసాధారణంగా పగిలిన రక్తనాళాన్ని బ్లాక్ చేయగలిగాము. ఈ చికిత్స చేసేందుకు అరగంట సమయం పట్టింది.
సాధారణంగా టీబీ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, పొగ తాగడం వల్ల ఇలాంటి ఇబ్బంది వస్తుంది. ఈ రోగిలో ఇంతకుముందు ఊపిరితిత్తుల సమస్య ఉండడం వల్ల తలెత్తింది. ఈ సమస్యకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో అయితే రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, ఇక్కడ మాత్రం ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా చేశాము.
రోగికి ఇలాంటి చికిత్స చేయకుండా వదిలేస్తే, పరిస్థితి మరింత విషమించి.. ప్రాణాపాయం కూడా సంభవించేది. ఎప్పుడైనా తీవ్రంగా దగ్గు వస్తూ.. అందులో రక్తం కూడా పడితే ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో సమస్య ఉందని అనుమానించాలి. దానికి సరైన చికిత్స చేయకపోతే రక్తం మరింత ఎక్కువగా కారుతుంది. దీనివల్ల రక్తహీనత సంభవించడంతో పాటు, ఒక్కోసారి ఊపిరితిత్తులు కూడా పాడైపోతాయి. అప్పుడు అవి తగినంత ఆక్సిజన్‌ను శరీరానికి అందించలేవు. అందువల్ల బ్రాంకియల్ ఆర్టెరీ ఎంబొలైజేషన్ అనేది చాలా సురక్షితమైన, సమర్థమైన చికిత్స.
గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ పల్మనాలజిస్టు వద్దకు వెళ్లినా, సమస్య చాలా తీవ్రమైనదని.. అందువల్ల బెంగళూరు లేదా హైదరాబాద్ వెళ్లాలని సూచించేవారు. ఇప్పుడు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఈ తరహా చికిత్సలు చేయగల వైద్యులతో పాటు అత్యాధునిక పరికరాలు కూడా ఉన్నాయి. దానికితోడు ఆరోగ్యశ్రీలో కూడా ఈ చికిత్స చేరడంతో.. ఈ రోగికి పూర్తి ఉచితంగానే అంతా చేయగలిగాం. ఈ తరహా సమస్యలు వచ్చినవారు ఇకపై పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అత్యుత్తమమైన కార్డియో పల్మనరీ విభాగం ఉంది. ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె చికిత్సలు చేస్తారు” అని డాక్టర్ మూడే సందీప్ తెలిపారు.
సరైన సమయానికి సరైన చికిత్స.. అది కూడా ఆరోగ్యశ్రీలో పూర్తి ఉచితంగా చేసి ప్రాణాలు కాపాడినందుకు డాక్టర్ మూడే సందీప్, డాక్టర్ మంగిశెట్టి యశోవర్ధన్, అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది అందరికీ రోగి, ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.