ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం రోడ్లపైకి తెచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా.. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు విజయవాడలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. పీఆర్సీ జీఓలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు ఆదాయ వనరులన్నీ అధికార పార్టీకి చేరాయని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆక్షేపించారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సీఎం జగన్ అన్ని వ్యవస్థలను, సంస్థలను నాశనం చేశారని, మైనింగ్, మద్యం వ్యాపారాలు లాభాల్లో నడుస్తున్నాయని ఆరోపించారు. గుడివాడలో అధికార పార్టీ నేతలు క్యాసినో నిర్వహించినా కేసులు పెట్టలేదని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.