ఏపీ బీజేపీలో వారిపై ప్రశంసలు కురిపించిన పురందేశ్వరి
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దూకుడు పెంచారు. ముఖ్యంగా క్యాడర్ ను పటిష్టం చేసుకునే దిశగా ఆమె ముందుకు వెళుతున్నారు.
By Medi Samrat Published on 12 Aug 2023 10:15 AM GMTబీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దూకుడు పెంచారు. ముఖ్యంగా క్యాడర్ ను పటిష్టం చేసుకునే దిశగా ఆమె ముందుకు వెళుతున్నారు. సర్పంచ్ ల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బాగా పోరాటం చేశారని రాష్ట్ర కార్యవర్గ నేతలను పురందేశ్వరి ప్రశంసించారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర కార్యవర్గ నేతలతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ, జనసేన పొత్తు సంకేతాలను బలంగా వినిపించాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ఈనెల 14న విభాజిత్, విభీషణ్ కార్యక్రమాన్ని చేపట్టాలని, రాత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శనను విజయవంతం చేయాలని సూచించారు.
అంతకు ముందు ఆర్థిక సంఘం నిధులను మళ్లించి పంచాయతీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో బీజేపీ నిరసన, ధర్నా చేపట్టింది. పురందేశ్వరి ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తున్న సర్పంచ్‌లు, ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచ్‌లు అప్పులు తెచ్చి మరీ గ్రామాలలో పనులు చేస్తున్నారని అన్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాల్లో పనులు చేపట్టిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. ఈ పాపం అంతా జగన్ ప్రభుత్వానిదే అని ఆరోపించారు.