రేపు ఏపీకి బిల్ గేట్స్..చంద్రబాబుతో హై-లెవల్ మీటింగ్!
టెక్ దిగ్గజం బిల్ గేట్స్ రేపు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు.
By - Knakam Karthik |
రేపు ఏపీకి బిల్ గేట్స్..చంద్రబాబుతో హై-లెవల్ మీటింగ్!
అమరావతి: టెక్ దిగ్గజం బిల్ గేట్స్ రేపు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సాగిస్తున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, కొత్త సాంకేతిక ఒప్పందాలపై చర్చించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
రేపు ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. పరిపాలనలో సాంకేతికతను ఏపీ ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుందో అధికారులు ఆయనకు వివరించనున్నారు.
కీలక భేటీలు:
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లతో బిల్ గేట్స్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న డిజిటల్ హెల్త్ రికార్డ్స్, పబ్లిక్ హెల్త్ పర్యవేక్షణపై రివ్యూ చేస్తారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన 2047 విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అమరావతిలో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న సుమారు రూ. 1,772 కోట్ల పెట్టుబడితో కూడిన క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డ్రోన్ల వినియోగంపై చర్చలు జరుగుతాయి.
సమావేశాల అనంతరం, బిల్ గేట్స్ అమరావతి సమీపంలోని ఉండవల్లి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తారు. అక్కడ ఏఐ సాంకేతికతతో సాగు చేస్తున్న పంటలను, డ్రోన్ల ద్వారా ఎరువుల పిచికారీ వంటి ఆధునిక పద్ధతులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు.