దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ కార్గో కోసం హార్టికల్చర్ ఎయిర్ స్ట్రిప్ ను అనంతపురానికి తీసుకుని రావాలని, పౌర విమానయాన శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేసిన ఈ ప్రతిపాదనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. అనంతపురం నగరానికి సమీపంలో విమానాశ్రయాన్ని ఐదేళ్ల క్రితం ప్రతిపాదించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల మంత్రిని కలిసిన సందర్భంగా ఎంపీ ఎయిర్ స్ట్రిప్ అవసరమని చెప్పి నివేదిక ఇచ్చారు.
ఈ ప్రాంతంలో సుమారు 2000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, ఇది NH 44కి దగ్గరగా ఉందని ఎంబీ అంబికా లక్ష్మీనారాయణ చెప్పారు. రాయలసీమ ప్రాంత రైతులు రవాణా సమస్యలను ఎదుర్కొంటున్నారని.. అందుకే ఎయిర్ కార్గో సౌకర్యం అవసరమని అన్నారు. బొప్పాయి, అరటి, తీపి నారింజ, దానిమ్మ, మామిడి, పుచ్చకాయల లాంటి నాణ్యమైన హార్టికల్చర్‌కు అనంతపురం ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా వీటికి ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉందని తెలిపారు. కార్గో రవాణా సౌకర్యం లేకపోవడంతో రైతులు రోజుల తరబడి రోడ్డు రవాణాపై ఆధారపడాల్సి వస్తోందని, అది పండ్ల నాణ్యత, తాజాదనంపై ప్రభావం చూపుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు ఎయిర్ కార్గో సౌకర్యంపై దృష్టి సారిస్తున్నాయని, దేశవ్యాప్తంగా ఉద్యానవన ఉత్పత్తులను రవాణా చేసే ఎయిర్ కార్గో వ్యవస్థకు అనంతపురంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.