రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో బిగ్‌ రిలీఫ్‌

సినీ నిర్మాత, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై నమోదైన కేసుల్లో రాష్ట్ర పోలీసులు వారం రోజుల పాటు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సోమవారం ఆంక్షలు విధించింది.

By అంజి  Published on  3 Dec 2024 4:05 AM
director Ramgopal Varma, AP High Court, APnews

రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో బిగ్‌ రిలీఫ్‌ 

అమరావతి: సినీ నిర్మాత, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై నమోదైన కేసుల్లో రాష్ట్ర పోలీసులు వారం రోజుల పాటు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సోమవారం ఆంక్షలు విధించింది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేశారంటూ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లో పలు కేసులు నమోదయ్యాయి. జస్టిస్ హరినాథ్ ఎన్ ఈ కేసును విచారణ కోసం డిసెంబర్ 9కి వాయిదా వేశారు. దీంతో అప్పటి వరకు చిత్రనిర్మాత ఆర్జీవీకి ఉపశమనం లభించినట్టైంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేసిన చిత్రాలు తాను తీసిన సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన పోస్టర్లని వర్మ తరపు న్యాయవాది రాజగోపాలవన్ తాయ్ వాదించారు. డైరెక్టర్ అండ్‌ ప్రొడ్యూసర్‌ ఆర్జీవీ ఎటువంటి నేరం చేయలేదు, ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేయడానికి బాధిత వ్యక్తులు కాదని న్యాయవాది వాదించారు. తన క్లయింట్ తరపున, వర్మపై ఉన్న అన్ని కేసులను కలపాలని, వాటిని ఒకటిగా పరిగణించాలని కోరుతూ తాను హైకోర్టును ఆశ్రయించానని రాజగోపాలవన్‌ చెప్పారు. ఈ పిటిషన్ డిసెంబర్ 11న విచారణకు వచ్చే అవకాశం ఉంది.

తనపై ఉన్న కేసుకు సంబంధించి తమ ముందు విచారణకు హాజరుకావాలని ప్రకాశం జిల్లా పోలీసులు వర్మకు రెండుసార్లు నోటీసులు అందించారు. అయితే వర్మ పోలీసుల విచారణకు రాలేదు. కానీ అధికారుల ముందు "డిజిటల్" హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వర్మ మీడియాలోని ఒక వర్గాన్ని లాగి, ఈ అంశంపై హైప్ క్రియేట్ చేస్తున్నారని, పరారీలో ఉండటం ద్వారా అరెస్టును తప్పించుకుంటున్నాడని ఊహాగానాలు చేస్తున్నారని అన్నాడు.

Next Story