అమరావతి: అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం నేటితో ముగియనుంది. జాబితాలో పేరు లేని రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ రోజుతో గడువు కూడా ముగియనుండటంతో అర్హులైన రైతులు త్వరపడాలని అధికారులు కోరుతున్నారు. రైతులు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 155251కు ఫోన్ చేయవచ్చని పేర్కొంది. అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, అన్నదాత సుఖీభవ పోర్టల్ ద్వారా కూడా పథకం స్టేటస్ చెక్ చేసుకునే వీలుందని అధికారులు చెప్తున్నారు.
కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిపి ఏపీ ప్రభుత్వం త్వరలోనే రూ.5 వేలు జమ చేయనుంది. మోదీ వారణాసి పర్యటనలో పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేస్తే ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా అప్పుడే విడుదలయ్యే ఛాన్సుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 2వ తేదీ వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు విడుదల చేస్తారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్ట్ రెండో తేదీ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా విడుదల చేస్తారని సమాచారం.