అమరావతి రాజధాని వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమిపూజ జరుగనుంది. మొదటి దశలో రూ.140 కోట్లు వ్యయంతో వివిధ పనుల్ని చేపట్టనున్నారు. రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించనున్నారు. ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. వీటి నిర్మాణాలకు రూ.48 కోట్లు ఖర్చు కానుంది. ఇక రెండోదశ పనులను రూ.120 కోట్లతో చేపట్టనున్నారు. శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం మొదటి విడత పూర్తైన నేపథ్యంలో రేపు శంకుస్థాపన అనంతరం రెండు, మూడవ విడత పనులు చేపట్టనున్నారు. 4వ విడత పనుల్ని కూడా త్వరలోనే చేపట్టి టెండర్లు పిలుస్తారు.