త్వరలో విశాఖలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ

Bharat Rashtra Samithi to hold massive public meeting in Vizag soon. త్వరలోనే విశాఖపట్నంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర

By అంజి  Published on  18 Jan 2023 8:42 AM GMT
త్వరలో విశాఖలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ

త్వరలోనే విశాఖపట్నంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరవుతారని, ఈ సభకు సంబంధించిన తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఖమ్మం బహిరంగ సభలో ఆయన తన అనుచరులతో కలిసి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఖమ్మంలో జరుగుతున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తోట చంద్రశేఖర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరేందుకు తోట చంద్రశేఖర్‌కు రూ.4 వేల కోట్ల విలువైన భూమిని ముఖ్యమంత్రి ఇచ్చారని రఘునందన్‌రావు చెప్పారు. దీనిని ఖండించిన ఆయన.. రఘునందన్‌రావు తన మాట నిజమని నిరూపిస్తే 90 శాతం భూమిని బీజేపీ ఎమ్మెల్యేకు ఇస్తానని చెప్పారు. తెలంగాణ మోడల్‌ అభివృద్ధిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేశామని, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తారని, కేంద్రంలో రైతు, ప్రజాహిత ప్రభుత్వాన్ని తీసుకువస్తారని చెప్పారు. సంక్షేమాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తారని అన్నారు.

ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ బుధవారం నిర్వహించనున్న బహిరంగ సభకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారని ముఖ్యమంత్రిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రశ్నించారు. రఘునందన్ రావు బీఆర్‌ఎస్‌ పార్టీని బీహార్ రాష్ట్ర సమితి (BRS) అని పిలిచారు. వివాదాస్పద మియాపూర్ భూములను తన బీఆర్ఎస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడికి సీఎం ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మియాపూర్ భూములను బీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడికి అప్పగించడం వెనుక కారణాలపై సీఎం మాట్లాడాలని అన్నారు. ఏపీ యూనిట్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ 40 ఎకరాల భూమిని ఆదిత్య కంపెనీ పేరుతో కొనుగోలు చేశారని ఆరోపించారు.

Next Story