స్వర్గీయ ఎన్టీఆర్ నాణేలపై 'బండ్ల గణేష్' స్పంద‌న‌

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా

By Medi Samrat  Published on  31 Aug 2023 7:34 PM IST
స్వర్గీయ ఎన్టీఆర్ నాణేలపై బండ్ల గణేష్ స్పంద‌న‌

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రూ. 100 విలువైన ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. దేవుళ్ల రూపాలను ప్రజలు ఎన్టీఆర్ లో చూసుకున్నారని.. రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ నాణేలకు సంబంధించి బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా నాణేలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మారకం, రెండు స్మారకం. మారకం అంటే మార్కెట్ లో మీరు ఉపయోగించే రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు. రెండోది స్మారక నాణెం. అంటే ఒక జ్ఞాపకార్థం, వారి గౌరవార్థం వీటిని ముద్రిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్ట్రీ అజమాయిషీలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, మింట్ అని రెండు వర్గాలు ఉంటాయి. నాసిక్ లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో నగదు, ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు ముద్రిస్తారు. హైదరాబాద్, కోల కతా, ముంబయిలో ఉన్న మింట్ లో మారకమయ్యే నాణేలు ముద్రిస్తారు. ఎవరైనా వ్యక్తులు వారి పేరు మీద తమకు కొన్ని నాణేలు కావాలి అంటే వాటిని కూడా ముద్రిస్తారు. కానీ, ఆర్డర్ చేసే సంఖ్య కొంచం ఎక్కువగా ఉండాలి. మొన్న విడుదల చేసిన ఎన్టీఆర్ నాణెం అలాంటిదే. దానిని పురందేశ్వరి ఆర్డర్ చేసి ముద్రించారంట. అలాంటి స్మారక నాణేలను కాయిన్ కలెక్ట్ చేసేవాళ్లు, దాచుకునే వాళ్లు కొనుగోలు చేస్తారు. ఈవిడ డబ్బు చెల్లించి వాటిని ముద్రించి.. విడుదల చేయమని కోరితే ద్రౌపది ముర్ము ఒప్పుకున్నారు. ఇటీవలే పీవీ నరసింహారావు శత జయంతి జరిగింది. మరి ప్రభుత్వం ఎందుకు ఆయన నాణేన్ని ముద్రించలేదు? ఎందుకుంటే వాళ్ల కుటుంబం ఆ పని చేయలేదు. ఎన్టీఆర్ కుటుంబం పూనుకుంది. ఎన్నికల సమయం కాబట్టి కొంత రాజకీయం కూడా ఉంటుంది” అంటూ బండ్ల గణేశ్ పోస్టు పెట్టారు.

Next Story