నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లపై సంపూర్ణ నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈ నిషేధం ప్లాస్టిక్ బ్యానర్ల తయారీ, దిగుమతులు, వినియోగం, రవాణాకు కూడా వర్తిస్తుంది. బ్యానర్లకు ప్లాస్టిక్ బదులు కాటన్‌ని వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర అటవీ పర్యావరణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది.
కాలుష్య నియంత్రణ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పారిశుధ్య సిబ్బంది నగరాలు, పట్టణాల్లో నిషేధం అమలును పర్యవేక్షిస్తారు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, జెడ్‌పి సిఇఓలు, పంచాయతీ సిబ్బంది చూస్తారు.
ఎవరైనా నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తారు. అలాగే అతిక్రమించిన వారిపై పర్యావరణ చట్టం-1986 ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంతే కాదు అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ బ్యానర్లను శాస్త్రీయంగా పారవేసేందుకు అధికారులు ఖర్చును సేకరించనున్నారు. ప్లాస్టిక్ నిషేధం అమలును పర్యవేక్షించే అధికారులకు పోలీసు, రెవెన్యూ, రవాణా, జీఎస్టీ అధికారులు సహకరిస్తారు.