సీఎం జగన్ ముందే సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని.!
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
By Medi Samrat Published on 23 Feb 2024 11:15 AM GMTప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశామన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని తెలిపారు.
ఈ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్లను ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఇబ్బందులను సృష్టించిందని అన్నారు. భూములకు నాకు ఎకరాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని.. ఆ ఆరోపణలు రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఒంగోలులో పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్పారు. నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకుంటే పోటీ కూడా చేయనని చెప్పానని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన భరోసా వల్లే ధైర్యంగా ఆ మాట చెప్పగలిగానని అన్నారు. సీఎం వల్లే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సాకారమైందన్నారు. గతంలో పేదలకు ఇళ్ళ స్థలాల కోసం యర్రజర్లలో చూసిన ప్రభుత్వ భూమికి టీడీపీ అడ్డంకులు సృష్టించిందని.. అందుకే అగ్రహారం, వెంగముక్కలపాలెంలలో భూములు చూశామన్నారు. ఇక్కడ కూడా టీడీపీ కోర్టు కేసులు వేయించి ఇబ్బందులు పెట్టాలని చూసిందని బాలినేని ఆరోపించారు.