సంచలనం రేపుతున్న అదానీ గ్రూప్ సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించి నాటి ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. సెకీతో ఒప్పందం తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని.. అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారని ఏదో మతలబు ఉందని సంతకం పెట్టలేదని చెప్పారు. అంత పెద్ద ఒప్పందంపై తనతో చర్చించకుండా సంతకం చేయమంటున్నారంటే ఏదో మతలబు ఉందనిపించి తాను సంతకం చేయబోనని చెప్పినట్లు బాలినేని పేర్కొన్నారు.
పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతామని తన పీఎస్ అంతకుముందే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. కాసేపటి తర్వాత శ్రీకాంత్ తన అదనపు పీఎస్కు ఫోన్ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని కేబినెట్ సమావేశానికి పంపాలని చెప్పారని బాలినేని వివరించారు. శ్రీకాంత్ చెప్పినట్లే ఉదయమే కేబినెట్ ముందుకు దస్త్రాన్ని తీసుకెళ్లానని బాలినేని పేర్కొన్నారు. మంత్రిమండలి సమావేశంలో ఒప్పందాన్ని ఆమోదించేశారని వివరించారు. తాను ఎక్కడా ఒక్క సంతకం చేయలేదని అంతా పెద్ద మంత్రి నడిపించారని తెలిపారు. అలా తన నిర్ణయాలతో ప్రమేయం లేకుండా ఒప్పందం జరిగిపోయిందన్నారు. అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు తనకెందుకు చెబుతారని వ్యాఖ్యానించారు. అడపాదడపా శ్రీకాంత్ వచ్చి సెకితో ఒప్పందం అని చర్చించేవారని పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదని బాలినేని వెల్లడించారు. జగన్కు ఈ వ్యవహారంపై అప్పట్లో ఏం జరిగిందో వివరించినట్లు బాలినేని పేర్కొన్నారు.