ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు. ఎవరి మెప్పు కోసమో తాను పనిచేయడం లేదని, సెకీతో ఒప్పందానికి సంబంధించి సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదన్నారు. తాను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరని, తాను వైసీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు.
రాజశేఖర్ రెడ్డి కుటుంబం వల్లే తాను పైకి వచ్చానంటూ మాట్లాడుతున్నారని, వైఎస్సే రాజకీయ భిక్ష పెట్టారని జనసేనలో చేరినప్పుడు తానే మీడియా ముఖంగా చెప్పానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైఎస్‌పై అభిమానంతోనే మంత్రి పదవి వదులుకొని జగన్ పార్టీలోకి వెళ్లానన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించాక మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని వదులుకున్నానని బాలినేని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్ మోహన్ రెడ్డేనా అని బాలినేని ప్రశ్నించారు. షర్మిల, విజయమ్మ కాదా? అని ప్రశ్నించారు. తిట్టేవాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసన్నారు.