నందమూరి బాలకృష్ణ.. హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ తన నియోజకవర్గానికి కావాల్సినవి ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా సీమకు నీటి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు బాలయ్య ప్రశ్నిస్తూ వస్తున్నారు. తాజాగా హిందూపురం పర్యటనకు నందమూరి బాలకృష్ణ వచ్చారు. హిందూపురంలో సీమ టీడీపీ నేతల సదస్సులో పాల్గొన్న బాలకృష్ణ రాయలసీమకు మిగులు జలాలు కాదు.. నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో చేపట్టిన నదుల అనుసంధానం జరగాలని ఆయన కోరారు. మన హక్కులను కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. అవసరమైతే సీమ నీటి ప్రయోజనాల కోసం ఢిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమాన్ని తీసుకొని రావాలని పిలుపును ఇచ్చారు.
రాయలసీమ ఒక్కప్పుడు రతనాల సీమ.. కానీ నిర్లక్ష్యం కి గురై ఈ పరిస్థితి వచ్చిందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక్కడి పరిస్థితి చూసి హంద్రీనీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని.. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి జోలె పట్టారని అన్నారు బాలకృష్ణ. తెలుగు గంగ ద్వారా కొంత వరకు సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. నీరు సమృద్ధిగా ఉన్నా హంద్రీనీవా ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వలేకపోయారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 1400 చెరువులు ఉంటే కేవలం 130 చెరువులకు మాత్రమే నీరు ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి నీరు ఇవ్వాలని లేదు.. ఎవర్నీ సంప్రదించరని అన్నారు.