తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. నందమూరి బాలకృష్ణ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. కొట్నూరు చెరువు ముంపు బాధితులను బాలకృష్ణ పరామర్శించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చౌడేశ్వరి కాలనీ, త్యాగరాజ నగర్, ఆర్‌టీసీ కాలనీ వాసులకు భోజనం, మంచినీరు అందేలా చూశారు. ఇటీవల కురిసిన వర్షాలు, కర్ణాటక జై మంగలి నది నుంచి వస్తున్న వరద ఉధృతతో పెన్నా నది ప్రవాహం పెరిగింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వరదలు వచ్చాయి. హిందూపురంలోని శ్రీకంఠపురం, కొట్నూరు, చెరువుల వద్ద రాకపోకలు బంద్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమస్యలు ఉన్నాయి.. పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే తాము చెప్పామని.. అయితే ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. హిందూపురం ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. ముంపు గ్రామాలకు తామే సహాయం అందిస్తూ వస్తున్నామని అన్నారు. వైసీపీ నేతలెవరైనా ప్రజల దగ్గరకు వస్తే.. ఆగ్రహాన్ని చూడాల్సిందేనని చెప్పుకొచ్చారు. తాము చెప్పిన పనులను చేసి ఉండి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని.. ఇలా ఇళ్లు మునిగిపోయేవే కాదని అన్నారు.