టాలీవుడ్ అగ్రనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పుల్లేటికుర్రు గ్రామంలో సందడి చేశారు. చౌడేశ్వరి అమ్మవారి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి నివాసానికి వెళ్లారు. అక్కడ, నాగమల్లేశ్వర సిద్ధాంతి, ఆయన కుటుంబ సభ్యులతో బాలయ్య ముచ్చటించారు. బాలకృష్ణ తమ గ్రామానికి రావడంతో పుల్లేటికుర్రు గ్రామస్తుల్లో ఉత్సాహం నెలకొంది. అభిమానులు నాగమల్లేశ్వర సిద్ధాంతి నివాసం వద్దకు భారీగా చేరుకుని జై బాలయ్య నినాదాలు చేశారు. బాలకృష్ణ వారికి అభివాదం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలయ్య కారులో వెళ్లిపోయారు.
అంతకు ముందు రోజు నందమూరి బాలకృష్ణ మహానాడులో పాల్గొన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలు తెచ్చారని నందమూరి బాలకృష్ణ కొనియాడారు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చారని అన్నారు. మహానుభావుడు అవ్వాలంటే మహోన్నత వ్యక్తిత్వం, ఆదర్శం వంటి మంచి లక్షణాలు ఉండాలన్నారు. కానీ ఇప్పుడు వేరే రకం మహానుభావులను చూస్తున్నామని అన్నారు. అన్ని వ్యవస్థలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, లక్షల కోట్ల భక్షకుడు, రావణ పాలన అన్నట్లుగా ఉందని విమర్శించారు.