గుడ్‌న్యూస్..రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్‌బుక్‌ల ఆటోమ్యుటేషన్
రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By - Knakam Karthik |
గుడ్‌న్యూస్..రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్‌బుక్‌ల ఆటోమ్యుటేషన్
అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సహా అన్నింటా రియల్ టైమ్‌లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం భూ యజమానులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి ప్రక్షాళన జరగాలని స్పష్టం చేశారు. దీనిపై ప్రతీనెలా సమీక్షిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.
సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు హాజరయ్యారు. పీజీఆర్ఎస్‌లో మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి 1,97,915 ఫిర్యాదులు వచ్చాయని సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ల్యాండ్ నేచర్, క్లాసిఫికేషన్ సంబంధిత వివాదాల దరఖాస్తులు 1,00,835, రీసర్వే అనంతరం భూమి తగ్గిందని వచ్చిన పీజీఆర్ఎస్ దరఖాస్తులు 1,00,295, జాయింట్ ఎల్‌పీఎంలపై 2,40,479 ఫిర్యాదులు నమోదైనట్టు వివరించారు.
రీసర్వే పురోగతిపై ప్రతీ నెలా నివేదిక
ప్రస్తుతం 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా, ఇంకా 10,123 గ్రామాల్లో చేయాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే 2027 డిసెంబరు నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతీ నెలా రీసర్వే పురోగతిపై నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. జాయింట్ లాండ్ పార్సెల్ మ్యాప్స్ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని, భూమి వివరాలు డేటా బేస్ ఆన్‌లైన్‌లో ఉంటే ఈసీ జారీ చేయడం సులభమవుతుందని సీఎం అన్నారు. అలాగే 22ఏ జాబితా నుంచి తొలగించాలని వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని సీఎం సూచించారు. 22ఏ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. డాక్యుమెంట్ల వివరాలను ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చెయిన్ లాంటి పటిష్ట వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. భూముల వివరాలు అన్నీ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచితే వివాదాలు తలెత్తవని సూచించారు. డిస్ప్యూటెడ్ ల్యాండ్స్‌గా పరిగణించడం, వాటిని తొలగించడం వంటి అధికారం ఇన్నాళ్లూ జాయింట్ కలెక్టర్‌కు ఉండగా... ఇకపై డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ పరిష్కరించే అధికారం ఆర్డీవోలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. చుక్కల భూములను 22ఏ జాబితా నుంచి తొలిగించే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. 1999 వరకూ ప్రాథమిక సహకార సంఘాల వద్ద తాకట్టు పెట్టిన అసైన్డ్ భూములు కూడా 22ఏ జాబితా నుంచి తొలిగించాలన్నారు. బంజరు భూములు 1954 కంటే ముందు సేల్ డీడ్స్ రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్‌ను 22ఏ నుంచి తొలగించాలని చెప్పారు.
రిజిస్ట్రేషన్ల శాఖలో రూ.10,169 కోట్ల రెవెన్యూ లక్షం
‘మున్సిపల్ పరిధిలో ఉన్న అసైన్డ్ భూములు మంత్రుల కమిటీ సిఫార్సు మేరకు 250 చదరపు గజాల లోపు స్థలాల్ని 50 శాతం బేస్ వాల్యూతో రెగ్యులరైజ్ చేయండి. అలాగే ఆక్వా కల్చర్ చేస్తున్న అసైన్డ్ భూముల్ని సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలి. అలాగే...10వ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులకు కుల ధృవీకరణ పత్రం వెంటనే పొందేలా కార్యాచరణ రూపొందించాలి. ఆర్టీజీఎస్‌తో అనుసంధానించిన సమాచారం ద్వారా ఆదాయ ధృవపత్రం ఇవ్వాలి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రూ.10,169 కోట్ల రెవెన్యూ లక్షంగా పెట్టుకున్నాం. మార్కెట్ విలువలతో భూమి విలువలు అప్ గ్రేడ్ చేయండి.’ అని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
రెవెన్యూ శాఖలో 86 శాతం వివాదాలు పరిష్కారం
గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు రెవెన్యూ శాఖకు 5,28,217 గ్రీవెన్సులు రాగా, వాటిలో 4,55,189 అంటే 86 శాతం గ్రీవెన్సులు పరిష్కారమయ్యాయని అధికారులు తెలిపారు. పరిశీలనలో మరో 73 వేల వరకు గ్రీవెన్సులు ఉన్నాయని, ఎవరైనా అర్జీల పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తే... ఆ ఫిర్యాదులను తిరిగి ఓపెన్ చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తమ భూముల వివరాలు తప్పించాలని కోరుతూ 6,846 దరఖాస్తులు దాఖలు కాగా... ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములు మాత్రం 22ఏ నుంచి తొలిగించనున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.