అమరావతి: జాతీయ స్థాయిలో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ అందించే ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ర్యాంకింగ్ లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 4వ స్థానంలో నిలిచింది. గతేడాది ఈ విభాగంలో ఏయూ 7వ స్థానంలో నిలవగా.. ఈ సంవత్సరం మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 4వ స్థానంలో నిలిచింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో నెంబర్ వన్ స్థానాన్ని ఏయూ కైవసం చేసుకుంది. విశ్వవిద్యాలయాల విభాగంలో గతేడాది 25వ స్థానంలో నిలవగా.. ఈ సంవత్సరం 23వ స్థానానికి చేరుకుంది.
కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు ఓవరాల్ విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 41 వ స్థానంలో నిలిచింది. గతేడాది సైతం ఏయూ 41వ స్థానాన్ని సంపాదించింది. అదేవిధంగా ఫార్మసీ కళాశాల 34వ స్థానం నుంచి 31వ స్థానానికి, ఇంజనీరింగ్ కళాశాల 90వ స్థానం నుంచి 88వ స్థానానికి చేరుకున్నాయి. అదే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల 16వ స్థానాన్ని నిలుపుకుంది.
స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 4వ స్థానంలో నిలవడం పట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ర్యాంకు మెరుగుపర్చకున్నందుకు యూనివర్సిటీకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, సుదీర్ఘ లక్ష్య సాధన మరింతగా కృషి చేయాలని పేర్కొన్నారు.