కర్ణాటకలో ఏపీకి చెందిన 13 మంది మృతికి జగనే కారణం: అచ్చెన్నాయుడు
కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది చనిపోవడానికి కారణం సీఎం జగనే అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 11:00 AM GMTకర్ణాటకలో ఏపీకి చెందిన 13 మంది మృతికి జగనే కారణం: అచ్చెన్నాయుడు
సీఎం జగన్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది చనిపోవడానికి కారనం సీఎం జగనే అంటూ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ చేతగాని పాలన వల్లే రైతుల పంటలు ఎండిపోతున్నాయని.. తద్వారా ఏపీలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దాంతో.. ఏపీకి చెందిన ప్రజలు పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని అన్నారు. అలా ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్లిన ఏపీకి చెందిన 13 మంది రోడ్డుప్రమాదంలో చనిపోయారని అన్నారు అచ్చెన్నాయుడు. అందుకే దీనంతటికీ కారణం సీఎం జగన్ ప్రభుత్వమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఇప్పుడున్న తీవ్ర కరువు పరిస్థితులు గత వందేళ్లలో ఎప్పుడూ చూడలేదని అన్నారు అచ్చెన్నాయుడు. సాగునీరు అందక కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. సీఎం జగన్ కనీసం వారివైపు కూడా చూడటం లేదని ఆరోపించారు. బతుకుదెరువు కోసం అనంతపురం వాసులు కర్ణాటకకు వెళ్లారనీ.. అక్కడ జరిగిన రోడ్డుప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని చెప్పారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ఉపాధి లభించి ఉంటే ఆ 13 మంది కర్ణాటకకు వెళ్లాల్సి వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో కరువు ప్రజలను భయపెడుతున్న వైసీపీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఖరీఫ్‌లో 40 లక్షల ఎకరాల్లో పంటే వేయలేదని చెప్పారు. ఇక వేసిన పంటలు నీరు లేక మూడొంతులు ఎండిపోయాయరని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు, కృష్ణా డెల్టా, గోదావరి జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఒక్క రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు. పట్టిసీమను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల 40 టీఎంసీల నీరు కోల్పోయామని అచ్చెన్న అన్నారు. ఉద్దేశపూర్వకంగా పట్టిసీమ పంపులకు జగన్ సర్కార్ బూజు పట్టించిందని మండిపడ్డారు. నీటి నిర్వహణలో జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. రాబోయే ఎన్నికల్లో రైతులే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.