ఆక్వా రైతులకు సబ్సిడీ తగ్గింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా మద్దతు ధర రూ.240 నుంచి రూ.210కి తగ్గించడం సీఎం వెస్ జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు.
ఆక్వా రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాడిన టీడీపీ నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని అన్నారు. చంద్రబాబు హయాంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆక్వా రంగం, నేడు సీఎం జగన్ పాలనలో క్షీణించే దశకు చేరుకుందని అన్నారు. మద్దతు ధర లేక ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, షరతుల పేరుతో సబ్సిడీలు ఎత్తివేసి ఆక్వా రైతులను జె-ట్యాక్స్‌తో దోచుకుంటున్నారని ఆరోపించారు.
ప్రశ్నించిన వారిని అణిచివేసేందుకు జగన్ రెడ్డి చేస్తున్న కుట్రలను సహించేది లేదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టిడిపి నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, వెంకట శివరామరాజు, పత్తిపాటి పుల్లారావుతో పాటు మరో 400 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఎం జగన్‌ని డిమాండ్ చేశారు.