ఇప్పటికే కొరియర్ కవర్లు, కార్గో పార్శిల్ సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ.. మరో అడుగు ముందుకేసింది. కొరియర్ సేవలను బస్టాండ్ నుంచి మరో బస్టాండ్‌కు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ ద్వారా కిలో లోపు బరువు ఉండే కొరియర్‌లను పంపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ వీలు కల్పించనుంది. కొరియర్ బుక్ చేసేలా కండక్టర్ల వద్ద ఉండే టికెట్ల జారీ మిషన్ (టిమ్స్)లో ఏర్పాట్లు చేస్తోంది. బుక్ చేసుకునే కొరియర్‌కు టిమ్ ద్వారా రిసిప్ట్ ఇస్తారు. కొరియర్ బుక్ చేసుకున్న వారు.. కవరుపై దానిని అందజేయాల్సిన అడ్రస్ రాయాలి. అంతేకాకుండా అది చేరాల్సిన వ్యక్తులకు ఫోన్ చేసి బస్సు వచ్చే టైమ్‌కి సిద్ధంగా ఉండాలని చెప్పాల్సి ఉంటుంది.
అప్పుడు బస్ కండక్టర్ లేదా డ్రైవర్ కొరియర్‌ను అందిస్తారు. వారం రోజుల్లో టిమ్స్ ద్వారా కొరియర్ కవర్ల బుకింగ్ ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాన బస్టాండ్లలో ఆర్టీసీ కొరియర్, కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో డెలివరీ సదుపాయం కల్పించారు. కొరియర్ సేవలను గ్రామాలు, చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రజలు ఉపయోగించుకునేందుకు అమలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి నిత్యం సగటున రూ.40 లక్షల వరకు ఆదాయం కార్గో సేవల ద్వారా వస్తోంది.