రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోనసీమ, తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తారు వర్షాలకు అవకాశం ఉందన్నారు.
గురువారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(జి) మల్లంలో 70మిమీ, కాకినాడ(జి) ఇంజరంలో 58మిమీ, తిరుపతి(జి) కోటలో 52.7మిమీ, ప్రకాశం(జి) గొల్లవిడిపిలో 52.2మిమీ, యర్రగొండపాలెంలో 49.7మిమీ, చిత్తూరు(జి) దామోదర మహారాజపురంలో 49మిమీ, కోనసీమ(జి) ఈతకోటలో 47మిమీ వర్షపాతం నమోదయిందన్నారు. అటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.