దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగకు ఏపీఎస్ ఆర్టీసీ 1,081 ప్రత్యేక బస్సులను రాష్ట్రవ్యాప్తంగా ఇతర నగరాలకు సాధారణ ఛార్జీలతో నడపనుంది. ఈ బస్సులు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 10 వరకు విజయవాడ నుండి వైజాగ్, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, అమలాపురం, భద్రాచలం, హైదరాబాద్, పొరుగు రాష్ట్రాల్లోని బెంగళూరు, చెన్నై, ఇతర నగరాలకు కూడా తిరుగుతాయి. టికెట్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని, పూర్తి వివరాలు ఏపీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రత్యేక బస్సుల్లో అధనపు ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ, ఈసారి ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ ఆర్టీసీ కూడా
తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 3,500 ప్రత్యేక బస్సులను నడిపించేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. సర్వీసులు నడిపించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచే కాకుండా హైదరాబాద్ లోని పలు ప్రధాన ప్రాంతాలైన ఎల్బీ నగర్, ఉప్పల్, కోఠి, కూకట్ పల్లి, మియాపూర్ నుంచి జిల్లాలకు సర్వీసులు నడవనున్నాయి.