నో పోస్ట్‌పోన్.. యథాతథంగా గ్రూప్-2 ఎగ్జామ్: APPSC
ఎగ్జామ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:03 PM IST
నో పోస్ట్‌పోన్.. యథాతథంగా గ్రూప్-2 ఎగ్జామ్: APPSC
ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై పోలీసులకు కంప్లయింట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. రోస్టర్ విధానంలో తప్పులు సరి చేసే వరకు పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో 899 పోస్టులు భర్తీ చేసేందుకు 2023 డిసెంబర్ 7వ తేదీన గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో గ్రూప్ 2 మెయిన్స్ ఆగిపోయింది. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఇందుకోసం 13 ఉమ్మడి జిల్లాల్లో 175 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అయితే రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించొద్దని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించకపోతే ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తుందని వాపోతున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ లోని రోస్టర్ విధానంలో లోపాలున్నాయని, వీటిని సరిచేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందిచాలని కొద్దిరోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు.