సలహాదారుల నియామకం.. ప్రమాదకరైమన వ్యవహారం: ఏపీ హైకోర్టు
Appointment of govt advisors not a good tradition, says AP Highcourt. అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులను నియమించడం మంచి సంప్రదాయం కాదని
By అంజి
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులను నియమించడం మంచి సంప్రదాయం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నాడు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. ఎండోమెంట్ శాఖకు, ఉద్యోగుల వ్యవహారాలకు సలహాదారుల నియామకంపై సవాల్ చేస్తూ ఏపీ సేవాబ్రాహ్మణ సంఘ సమాఖ్య ప్రతినిధి హెచ్‌కే రాజశేఖర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్లు, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలని హైకోర్టు సూచించింది.
రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దని సూచించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసని హెచ్చరించింది. చిన్న రాజకీయ సమస్యలపై పిటిషన్లు దాఖలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. దీనిపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తూ అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ హైకోర్టుకు మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన వ్యక్తులను మాత్రమే ప్రభుత్వ సలహాదారులుగా నియమించారని తెలిపారు.
అడ్వైజర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం.. వారి నియామకాల అభిప్రాయాన్ని తీసుకుంటుందని ఏజీ తన వాదనల్లో హైకోర్టుకు తెలియజేసి, ఇది కొత్త పద్ధతి కాదని స్పష్టం చేశారు. ఈ కేసులో మెరిట్‌ల ఆధారంగా వాదిస్తామని చెప్పారు. అయితే, ఉద్యోగుల టీఏ, డీఏ వంటి అంశాలపై ప్రభుత్వ సలహాదారు ఎలా నిర్ణయం తీసుకుంటారని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేస్తూ ఏజీని ప్రశ్నించింది. సలహాదారుల నియామకం మంచి సంప్రదాయం కాదని పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఎండోమెంట్ శాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్‌ను, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.