తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న దశరథరామిరెడ్డిని ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్‌రాష్ట్ర డిప్యుటేషన్‌పై ఏపీకి తీసుకొచ్చి మరీ ఈ బాధ్యతలు అప్పగించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా డిప్యుటేషన్‌పై తనను నియమించాలంటూ జనవరి 20న దశరథరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అందుకు సమ్మతి తెలపాలని ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 11న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం.. రెండేళ్ల పాటు అంతర్‌రాష్ట్ర డిప్యుటేషన్‌కు సమ్మతించింది. దీంతో ఆయన్ను సజ్జలకు ఓఎస్డీగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దశరథరామిరెడ్డికి ఎలాంటి టిఏ డిఏలు వర్తించవని ఆయన విజ్జప్తి మేరకే ఈ నియామకం జరిగిందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక దీంతో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.