అమరావతి: నవంబర్ 30తో ముగిసిన పీఎం ఆవాస్ యోజన గ్రామీన (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/ వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. లేదంటే ఆన్‌లైన్‌లో pmayg.nic.in వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తును ఆమోదించిన తర్వాత, ఇవ్వాల్సిన డబ్బును బ్యాంక్ అకౌంట్‌లో వివిధ దశల్లో జమ చేస్తారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థిక సాయం అందజేస్తారు
ఈ పథకానికి సంబంధించి అర్హతల ప్రకారం.. గ్రామాల్లో నివసించే వారి ఆదాయం నెలకు రూ.15,000 కంటే తక్కువగా ఉండాలి. సొంత పక్కా ఇల్లు లేని వారు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. మహిళలు, SC, ST వర్గాల వారు, దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్, ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రెండు కలిసి అమలు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15.59 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసింది. మిగిలినవాటిని నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు.