కాంగ్రెస్‌ కొత్త పథకం.. మహిళలకు నెల రూ.5 వేలు.. యాప్‌ లాంఛ్

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేద ఆడ బిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల తెలిపారు.

By అంజి  Published on  10 March 2024 11:14 AM IST
APPCC, YS Sharmila, APnews, Congress

కాంగ్రెస్‌ కొత్త పథకం.. మహిళలకు నెల రూ.5 వేలు.. యాప్‌ లాంఛ్ 

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేద ఆడ బిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల తెలిపారు. ఈ పథకం కింద పేద ఆడిబడ్డలకు ప్రతి నెల 5 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం 'ఇందిరమ్మ అభయం' పథకం యాప్‌ను లాంఛ్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఇవాళ లాంఛ్‌ చేసిన యాప్‌లో అర్హులైన కొందరు మహిళల వివరాలు పొందుపర్చామన్నారు. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్‌ ద్వారా సేకరిస్తామన్నారు. పేద కుటుంబాలకు అండగా ఉండాలనే ఈ పథకం రూపొందించామని షర్మిల ట్వీట్ చేశారు. ఈ పథకం అమలు కావాంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న షర్మిల.. పేద కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు.

నిన్న మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ వెన్నుపోటు పొడిచిందన్నారు. జగనన్న, చంద్రబాబు బీజేపీ తొత్తులుగా మారారని, చంద్రబాబు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మెగా డీఎస్సీ వేస్తానని కేవలం 7వేల ఉద్యోగులు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఇక జగనన్న మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ తెచ్చారని మండిపడ్డారు. వీరిద్దరిలో ఎవరూ అధికారంలోకి వచ్చినా ఉపయోగం లేదని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు. ''పేద ఆడబిడ్డలకు అండగా ఉండటానికి 'ఇందిరమ్మ అభయం' పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం ద్వారా ప్రతి నెల 5వేల రూపాయలు ఆ ఇంటి మహిళ పేరు మీద ఇవ్వనున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఈ పథకం అమలు చేస్తాం'' అని చెప్పారు.

Next Story