అమరావతికి గుడ్‌న్యూస్, రూ.11 వేల కోట్ల రుణానికి సీఆర్డీఏ, హడ్కో మధ్య ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 16 March 2025 2:51 PM IST
అమరావతికి గుడ్‌న్యూస్, రూ.11 వేల కోట్ల రుణానికి సీఆర్డీఏ, హడ్కో మధ్య ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పనుల ప్రారంభానికి చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేలా ఇవాళ ఓ కీలక ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆదివారం సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం కుదిరింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్న ఏపీ ప్రభుత్వం..హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో)కు పంపిన ప్రతిపాదనల్ని తాజాగా జనవరిలో ఆమోదించారు.
ఈ మేరకు జనవరి 22 న ముంబై లో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. ఇందులో భాగంగా హడ్కో నుంచి 11 వేల కోట్ల రుణం అమరావతి రాజధానికి లభించబోతోంది. ఆ మేరకు నేడు హడ్కో... ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే హడ్కో నిధులు విడుదల చేయనుంది.
ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సిఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11 వేల కోట్లు రుణంగా అందించనుంది. దీంతో రాజధాని ప్రాజెక్టులకు నిధుల కొరత తీరబోతోంది. హడ్కో రుణాన్ని ప్రభుత్వం భవిష్యత్తులో వాయిదాల రూపంలో తీర్చాల్సి ఉంటుంది.