'స్కూల్‌ గదిలో అత్యాచారం'.. సీఎం జగన్‌కి బాలిక ఆర్తనాదాలు వినిపించవు: వైఎస్‌ షర్మిల

లండన్‌ వీధుల్లో విహరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ కి రాష్ట్రంలో జరుగుతున్న ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు.

By అంజి  Published on  24 May 2024 7:30 PM IST
APCC chief YS Sharmila, cm ys jagan, APnews

'స్కూల్‌ గదిలో అత్యాచారం'.. సీఎం జగన్‌కి బాలిక ఆర్తనాదాలు వినిపించవు: వైఎస్‌ షర్మిల

లండన్‌ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. 13 ఏళ్ల ఓ విద్యార్థిని అత్యాచారానికి సంబంధించిన న్యూస్‌ క్లిప్‌ను షేర్‌ చేస్తూ సీఎం జగన్‌పై ఆమె విమర్శలు చేశారు. 'మీ పాలన మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడ అని దేశం అంతా చెప్పుకుంటోంది' అంటూ ట్వీట్‌ చేశారు. ఏపీలోని ఓ పాఠశాలలో 13 ఏళ్ల బాలికపై ఆమె సీనియర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఉద్దేశిస్తూ షర్మిల ఎక్స్(ట్విట్టర్) వేదికగా సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

''నా అక్కలూ, నా చెల్లెమ్మలు, నా తల్లులూ, నా అవ్వలూ అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలూ నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు'' అంటూ షర్మిల ట్వీట్‌ చేశారు.

ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై చింతపాడుకు చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఎస్‌ఐ రామచంద్రారావు తెలిపారు. బాలిక ఈనెల 15న ఫ్రెండ్ పిలిచిందని స్కూల్ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెల్లి ఆత్యాచారం చేయగా.. మరో నలుగురు వీడియో తీసి బాలిక తల్లికి పంపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు.

Next Story