సీఎం చంద్రబాబుకు ఆ ఆశ మాత్రం చావలేదు..షర్మిల తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

By -  Knakam Karthik
Published on : 9 Nov 2025 12:22 PM IST

Andrapradesh, YS Sharmila, Polavaram project, Nallamala Sagar, CM Chandrababu, Irrigation projects

సీఎం చంద్రబాబుకు ఆ ఆశ మాత్రం చావలేదు..షర్మిల తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం భారీ అవినీతికి వేసిన పథకమని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇదొక ఏటీఎంలా పనిచేస్తుందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

"నిన్న బనకచర్ల, నేడు నల్లమల సాగర్.. పోలవరం లింక్ ప్రాజెక్టుకు అనుమతులు రాకున్నా చంద్రబాబు గారి ఆశ మాత్రం చావలేదు. ప్రాజెక్టుల అనుసంధానంపై ఉన్న శ్రద్ధ.. పోలవరం పూర్తి చేయడంపై లేదు," అని షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు. నిపుణులు వద్దంటున్నా డీపీఆర్‌ల పేరుతో హడావుడి చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలవరంతో పాటు 56 సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండగా, వాటిని గాలికొదిలేసి లింక్ ప్రాజెక్టును పట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి జీవనాడిలో జీవం తీశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్ల పునరావాస ప్యాకేజీని మిగుల్చుకోవడం కోసమే ఈ అన్యాయం చేసిందని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. పోలవరం, ఇతర జలయజ్ఞం ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానికి సవతి తల్లి ప్రేమ ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 56 జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సుమారు రూ.60 వేల కోట్లు అవసరమని, వాటిని పూర్తి చేస్తే 54 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని షర్మిల వివరించారు. లింక్ ప్రాజెక్టుకు పెట్టే నిధులతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని, కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని అన్నారు. దీన్ని బట్టే సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు.

Next Story